Tuesday, March 27, 2007

Wednesday, March 21, 2007

కుందేలు - తాబేలు




ఒక అడవిలో ఒక కుందేలు, అక్కడే చెఱువులో ఒక తాబేలు నివసిస్తూ వుండేవి.
కుందేలుకి ఏమో తనని పరుగుపందెంలో ఎవరూ ఓడించలేరు అని బాగా గర్వం అన్నమాట.
అలా ఒకనాడు ప్రగల్భాలు పలుకుతూ తాబేలుతో "నాతో పందెం కాయి గెలుపు ఎవరికి లభిస్తుందో చూద్దాం" అని తాబేలుని ఉసిగొల్పింది. తాబేలేమో సరే అని ఒప్పుకుంది.
ఇక పందెం ప్రారంభం అయ్యింది. కుందేలు ఏమో గబగబ గంతులువేస్తూ ముందుకు పరుగెత్తింది. తాబేలేమో పాపం నెమ్మదిగా నడుస్తూ వస్తోంది. కుందేలు కొంచెం దూరం పోయాక, వెనక్కి తిరిగి చూస్తే తాబేలు కనపడలేదు.
సరే ఈ తాబేలు నన్ను ఎప్పుడు ఓడించాలి అనుకుంటూ, పక్కనే వున్న పొదల మాటున కొంతసేపు నిద్రపోయింది.
ఇంతలో పట్టుదల కలిగిన మన తాబేలు ఎలాగైనా పందెంలో నెగ్గాలి అనుకుంటూ, నడుచుకుంటూ వస్తూనిద్రపోతున్న కుందేలుని చూసి కొంచం వేగం పెంచి గమ్యస్థానానికి చేరుకుంది. కొంచం సేపు అయ్యాక, మన కుందేలుకి మెలకువ వచ్చింది. లేచి చూస్తే తాబేలు కనపడలేదు.హయ్యో... ఈ తాబేలు ఇంకా ఎక్కడో వెనకాల వుండి వుంటుంది. నేను పోయి పందెం గెలుస్తా ఇక అని మళ్ళీపరుగులు ప్రారంభించింది.
గమ్యస్థానానికి చేరిన కుందేలుకి, అప్పటికే అక్కడ వున్న తాబేలుని చూసి గర్వభంగం అయ్యిందన్న మాట.
మరి ఇందులో నీతి ఏమిటి పిల్లలూ?

ప్రగల్భాలు పలికే వారు ఎప్పుడూ కార్యాన్ని సాదించలేరు. కాబట్టి ఎప్పుడూ గర్వాన్ని పెంచుకోకూడదు.
^
^
~*~
^
^

Thursday, March 15, 2007

ఆవు - పెద్దపులి





ఒక అడవిలో ఒక పులి వుండేది.
అది ఆకలితో తిరుగుచుండగా దానికొక ఆవు కనపడింది. అలాకనపడగానే దానిని తినటానికి పులి ఆవు మీద పడింది. అప్పుడు ఆ ఆవు మనసులో భయపడినది గాని, ఎలాగూ పులి చంపితింటుంది అని నిశ్చయించుకుని
"అయ్యా నేను ఈ మధ్యనే ఈనాను. నా దూడ పాలకి యేడుస్తూ వుంటుంది. నేను వెళ్ళి పాలు ఇచ్చిఇప్పుడే వస్తాను. ఆ దైవ సాక్షిగా నా మాట నమ్ము" అని పులిని అడిగింది.
ఆ మాటలు పులి రాజు నమ్మి "పోయి రా" అని చెప్పగానే ఆ ఆవు పరుగెత్తుకుని పోయి తన దూడకి కడుపునిండాపాలు ఇచ్చి, తోడి పశువులకు దూడని అప్పగించి పులి వద్దకు వచ్చింది.
అప్పుడు మన పులి రాజు, ఆవు తన మీద వుంచిన నమ్మకాన్ని వమ్ము చేయనందుకు సంతోషించి,దాన్ని చంపక దయతో విడిచి పెట్టింది. ఆవు పులి దయా గుణాన్ని మెచ్చుకుని ఇంటికి పోయి తన దూడతోహాయిగా వుంది.
~
ఈ కధలో నీతి యేమిటి పిల్లలూ?
~
సత్యము వలన ఎల్లప్పుడూ మేలు కలుగుతుంది. ఎప్పుడూ అబద్దాలు ఆడకూడదు.
^
^

కాకి - నెమలి








ఒక అడవిలో నెమళ్ళు గుంపుగా వుండేవి. అదే అడవిలో కాకుల గుంపు కూడా వుండేది. ఒక రోజు నెమళ్ళు అన్నీ తమ తమ పింఛాలు పురి విప్పుకుని ఆనందంతో వుండగా, కాకుల గుంపులో ఒక కాకి వాటిని చూసి అసూయతో"నాకు కూడా ఇలా పింఛాలు వుంటే బాగుండు కదా" అని బాగా ముచ్చట పడి ఊడి పడిపోయిన నెమలి ఈకలు యేరితెచ్చుకుని తన తోకకి అంటించుకుని, కులుకుతూ తిరగటం మొదలు పెట్టింది.
ఇలా రోజు కొన్ని ఈకలు తెచ్చుకుని "నేనే గొప్ప, నేనే గొప్ప" అని అనటం మొదలు పెట్టింది. కొద్ది రోజులు అయ్యేప్పటికినెమళ్ళు ఈ సంగతి కనిపెట్టి, దానికి వున్న నాలుగు ఈకలూ కూడా పీకి పారేసి తరిమి కొట్టాయి.
ఈకలు అన్నీ ఊడి పోగానే దెబ్బకి కాకి రూపం మారిపోయింది. అందువల్ల మిగిలిన కాకులు కూడా తమ గుంపులోంచి ఈకాకిని వెళ్ళగొట్టాయి. ఎందులోనూ చేరక కాకి విచారిస్థూ కూర్చుంది.
~
మరి ఈ కధలో నీతి యేమిటి పిల్లలూ?
~
తనకు లేని వేషములు వేయకూడదు, వేరే వాళ్ళని చూసి వాళ్ళకి వున్నాయి అని మనము వాతలు పెట్టుకోకూడదు.
^
^