Tuesday, May 15, 2007

ఐకమత్యం ~ ఆలోచన


ఒక రోజు ఆకాశంలో కొన్ని పావురాలు గుంపుగా ఎగురుతూ వెళుతున్నాయి. అలా వెళుతు వెళుతూ నేల మీద ఒక చోట నూకలు పోసి వుండటం చూశాయి ఆ పావురాలు. నూకలు తినాలనే ఆశతో అవి కనిపించిన వైపు వెళ్ళబోతున్న పావురాలను హెచ్చరించాడు వాటి నాయుకుడు.
"అడవిలో నూకలు రావడం ఆశ్చర్యంగా వుంది. దీని వెనుక ఏదో మోసం వుండి వుంటుంది. ఈ నూకల కోసం మనం ఆశ పడకూడదు" అని. అందుకు ఆ గుంపులోని ఒక ముసలి పావురం
"లేని పోని అనుమానాలతో దొరికిన ఆహారాన్ని వదులుకుంటే బ్రతకడం ఎలాగ?" అని తమ నాయకుని మాటను త్రోసిపుచ్చింది. మిగిలిన పావురాలు కూడా నూకలపై ఆశతో ముసలి పావురం మాటకే వంత పాడాయి. అలా నాయకుడి మాటను పెడ చెవిన పెట్టి పావురాల గుంపు ఎగురుతూ వచ్చి నేలపై వాలింది.
అంతే! అలా వచ్చే పక్షుల కోసమే వల వేసి వుంచిన ఒక వేటగాడి వలలో చిక్కుకున్నాయి పావురాలన్నీ. దాంతో అందరూ ముసలి పావురాన్ని నిందించడం మొదలు పెట్టారు. అప్పుడు మళ్ళీ పావురాల నాయకుడు ఇలా అన్నాడు "ఆపదలు వచ్చినపుడు ఆలోచన ముఖ్యం. అంతేగానీ ఇలా ఒకరినొకరు నిందించుకుని ఏమి లాభం? ముందు మనం ఈ ఆపద నుండి భయట పడాలి. అందుకు నేనొక ఆలోచన చెప్తా జాగ్రత్తగా వినండి. మనమందరం ఒక్కసారిగా గనుక పైకెగిరితే వలతో సహా పైకెళ్ళిపోవచ్చు. అదుగో వేటగాడు ఇటే వస్తున్నాడు. త్వరగా మన శక్తినంతా ఉపయోగించి ఒక్కసారిగా పైకెగురుదాం, ఊ..".
అంతే పావురాలన్నీ తమ నాయకుడు చెప్పినట్టుగానే శక్తినంతా కూడాగట్టుకుని వలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయాయి.
పావురాల నాయకుడు తన మిత్రుడైన ఒక ఎలుక దగ్గరకు వాటిని తీసుకెళ్ళాడు. ఎలుక వాడియైన తన పళ్ళతో ఆ వలను కొరికి పావురలను విడిపించింది.
చూశారా పిల్లలూ! ఐకమత్యంగా వుండి పావురాలు తమని తాము ప్రాణాపాయం నుండి ఎలా కాపాడుకున్నాయో!
మరి ఈ కథలో మీరు తెలుసుకున్న నీతి యేమిటి?
ఐకమత్యంతో ఏ పనైనా సులువుగా సాధించ వచ్చు. అంతే కాదు, ఈ కథలో మరో నీతి కూడా వుంది. ఆపదలో చిక్కుకున్నప్పుడు ఆలోచన ముఖ్యం.

No comments: