Friday, June 1, 2007

సింహము ~ కుందేలు


పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద సింహం నివసిస్తూ ఉండేది. అది రోజు దాని ఆకలి తీర్చుకోడానికి ఆ అడవిలోని అనేక జంతువులను చంపి తింటూ వుండేది.

దానితో అడవిలోని జంతువులన్నిటికి, ఇలా అయితే కొన్నాళ్ళకి తమలో ఏ ఒక్కటి ప్రాణాలతో మిగలవని భయం పట్టుకుంది. అందువల్ల అవి అన్నీ కలిసి సింహంతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాయి.

మొత్తం అడవిలో జంతువులన్నీ కలసి సింహం దగ్గరకి రావడం చూసి సింహం మహ సంబర పడిపోయింది. తను కష్టపడి వాటిని వెంటాడి వేటాడే పని లేకుండా అవే తన దగ్గరకు రావడం సింహానికి సంతోషాన్ని కలిగించింది.

ఇంతలో వాటిలో ఒక జంతువు సింహం ముందుకు వచ్చి ముందుగా తాము చెప్పబోయే మాట ఒక్కసారి వినమని అభ్యర్దించింది. "సరే" అంది సింహం గంభీరంగా. "అయ్యా ! మీరు ఈ అరణ్యానికి రారాజు. మేము మీ రాజ్యంలోని సామాన్య జంతువులం. మిమ్మల్ని ఎదురించే శక్తి మాలో ఏ ఒక్కరికి లేదు. మీరు గనుక మమ్మల్నందరిని ఒకేసారి చంపేస్తే ఇక మీరు ఎవరికి రాజు గా వుంటారు? మిమ్మల్ని రాజుగా గౌరవించే వాళ్ళు, భయపడే వాళ్ళు ఎవరుంటారు?అందువల్ల మా అంతట మేమే రోజుకొకరం చొప్పున మీ దగ్గరకి ఆహారంగా వస్తాం".
ఈ ఒప్పందానికి ఒప్పుకుంది సింహం. కాకపోతే తనకి ఏ ఒక్క రోజైనా ఆహారం అందించకుండా ఒప్పంద ఉల్లంఘన జరిగితే మాత్రం మొత్తం అన్ని జంతువులను చంపేస్తానని హెచ్చరించింది.

ఆ రోజు నుండి అడవిలోని జంతువులలో రోజుకి ఒక జంతువు సింహానికి ఆహారంగా పంపబడుతోంది. సింహం కష్ట పడక్కరలేకుండా హాయిగా కాలం గడిపేస్తోంది.

అలా రోజులు గడుస్తుండగా ఒక రోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది మన సింహరాజుకి ఆహారంగా వెళ్ళడానికి. చూస్తూ చూస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడం ఎవరికి మాత్రం సరదా. అలాగే ఆ కుందేలుకి కూడా సింహానికి ఆహారంగా మారడానికి సుతారమూ మనసు ఒప్పలేదు. అందులోనూ ఈ కుందేలు చాలా తెలివైనది కావడం వల్ల తన ప్రాణాలే కాక అడవిలోని మిగతా జంతువులన్నిటి ప్రాణాలు కూడా కాపాడే పథకం ఒకటి వేసింది.

సరే, కుందేలు మెల్లిగా నడుచుకుంటూ సింహపు గుహలోకి అడుగు పెట్టింది. అప్పటికే మంచి ఆకలితో అటూ ఇటూ పచార్లు చేస్తున్న మన సింహానికి ఒక చిన్న కుందేలు ఆహారంగా రావడం చూసి పట్టలేని కోపం వచ్చింది. ఇక ఇలా లాభం లేదని మొత్తం అన్ని జంతువులను చంపేస్తానని కోపంగా అక్కడనుండి బయలుదేరుతున్న సింహాన్ని ఆపి ఇలా అన్నది కుందేలు "రాజా! నిజానికి మా వాళ్ళు ఈ రోజు మీకు ఆహారంగా ఆరు(6) కుందేళ్ళని పంపాయి. కాని మిగతా ఐదు(5) కుందేళ్ళని మరొక సింహం చంపి తినేసింది".కోపంతో బిగ్గరగా గర్జించింది సింహం. తన ఆహారాన్నే చంపి తిన్న ఆ మరొక సింహం ఎవరో వెంటనే తెలుసుకోవాలనుకున్నది.

కుందేలు మన సింహరాజుని ఇంకా రెచ్చగొట్టడం కోసం ఆ మరో సింహం చాలా పెద్దదని, పైగా ఈ అడవికి రాజు నువ్వా? - నేనా? తేల్చుకుందాం, ధైర్యం ఉంటే రమ్మందని మొదలైన మాటలు చెప్పడం ప్రారంభించింది. దానితో ఇంక కోపం పట్టలేని సింహరాజు కుందేలుతో తనని వెనువెంటనే ఆ మరో సింహం దగ్గరకు తీసుకెళ్ళమంది దాన్ని చంపటానికి.

కుందేలు సింహరాజుని తన వెంట ఒక లోతైన పెద్ద బావి వద్దకు తీసుకెళ్ళి ఆ మరో సింహం ఆ బావిలో వుందని చెప్పింది. సింహం బావి లోకి తొంగి చూసింది. బావిలో కనపడుతున్న తన ప్రతిబింబం చూసి అది ఆ మరో సింహం అని అనుకుని కోపంతో పెద్దగా గర్జించింది. బావిలోని ప్రతిబింబం కూడా గర్జించించినట్టు కనపడ్డమే కాక తన గర్జన ప్రతిధ్వని విని అది బావిలోని సింహపు అరుపుగా భ్రమించింది.

ఇక వెంటనే దానితో కలబడదామని నిర్ణయించుకుని బావిలోకి దూకింది మన సింహరాజు. ఇంకేముంది, బావిలోని బండరాయికి తల కొట్టుకోడంతో అక్కడికక్కడే చనిపోయింది సింహం.

అటుపై కుందేలు తనవారిని చేరుకుని అందరూ కలిసి హాయిగా జీవించారు.

మూలం : పంచతంత్రం కథలు

4 comments:

రాధిక said...

మీ ఈ ప్రయత్నం చాలా బాగుంది.

హృదయ బృందావని said...

Thank U Radhika garu :)

Anonymous said...

nice story radha..kids.,.ma kids..like..chesaru.

Unknown said...

i need neethi for this.im working for my project on this story