Showing posts with label నీతి కథలు. Show all posts
Showing posts with label నీతి కథలు. Show all posts

Friday, June 1, 2007

సింహము ~ కుందేలు


పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద సింహం నివసిస్తూ ఉండేది. అది రోజు దాని ఆకలి తీర్చుకోడానికి ఆ అడవిలోని అనేక జంతువులను చంపి తింటూ వుండేది.

దానితో అడవిలోని జంతువులన్నిటికి, ఇలా అయితే కొన్నాళ్ళకి తమలో ఏ ఒక్కటి ప్రాణాలతో మిగలవని భయం పట్టుకుంది. అందువల్ల అవి అన్నీ కలిసి సింహంతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాయి.

మొత్తం అడవిలో జంతువులన్నీ కలసి సింహం దగ్గరకి రావడం చూసి సింహం మహ సంబర పడిపోయింది. తను కష్టపడి వాటిని వెంటాడి వేటాడే పని లేకుండా అవే తన దగ్గరకు రావడం సింహానికి సంతోషాన్ని కలిగించింది.

ఇంతలో వాటిలో ఒక జంతువు సింహం ముందుకు వచ్చి ముందుగా తాము చెప్పబోయే మాట ఒక్కసారి వినమని అభ్యర్దించింది. "సరే" అంది సింహం గంభీరంగా. "అయ్యా ! మీరు ఈ అరణ్యానికి రారాజు. మేము మీ రాజ్యంలోని సామాన్య జంతువులం. మిమ్మల్ని ఎదురించే శక్తి మాలో ఏ ఒక్కరికి లేదు. మీరు గనుక మమ్మల్నందరిని ఒకేసారి చంపేస్తే ఇక మీరు ఎవరికి రాజు గా వుంటారు? మిమ్మల్ని రాజుగా గౌరవించే వాళ్ళు, భయపడే వాళ్ళు ఎవరుంటారు?అందువల్ల మా అంతట మేమే రోజుకొకరం చొప్పున మీ దగ్గరకి ఆహారంగా వస్తాం".
ఈ ఒప్పందానికి ఒప్పుకుంది సింహం. కాకపోతే తనకి ఏ ఒక్క రోజైనా ఆహారం అందించకుండా ఒప్పంద ఉల్లంఘన జరిగితే మాత్రం మొత్తం అన్ని జంతువులను చంపేస్తానని హెచ్చరించింది.

ఆ రోజు నుండి అడవిలోని జంతువులలో రోజుకి ఒక జంతువు సింహానికి ఆహారంగా పంపబడుతోంది. సింహం కష్ట పడక్కరలేకుండా హాయిగా కాలం గడిపేస్తోంది.

అలా రోజులు గడుస్తుండగా ఒక రోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది మన సింహరాజుకి ఆహారంగా వెళ్ళడానికి. చూస్తూ చూస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడం ఎవరికి మాత్రం సరదా. అలాగే ఆ కుందేలుకి కూడా సింహానికి ఆహారంగా మారడానికి సుతారమూ మనసు ఒప్పలేదు. అందులోనూ ఈ కుందేలు చాలా తెలివైనది కావడం వల్ల తన ప్రాణాలే కాక అడవిలోని మిగతా జంతువులన్నిటి ప్రాణాలు కూడా కాపాడే పథకం ఒకటి వేసింది.

సరే, కుందేలు మెల్లిగా నడుచుకుంటూ సింహపు గుహలోకి అడుగు పెట్టింది. అప్పటికే మంచి ఆకలితో అటూ ఇటూ పచార్లు చేస్తున్న మన సింహానికి ఒక చిన్న కుందేలు ఆహారంగా రావడం చూసి పట్టలేని కోపం వచ్చింది. ఇక ఇలా లాభం లేదని మొత్తం అన్ని జంతువులను చంపేస్తానని కోపంగా అక్కడనుండి బయలుదేరుతున్న సింహాన్ని ఆపి ఇలా అన్నది కుందేలు "రాజా! నిజానికి మా వాళ్ళు ఈ రోజు మీకు ఆహారంగా ఆరు(6) కుందేళ్ళని పంపాయి. కాని మిగతా ఐదు(5) కుందేళ్ళని మరొక సింహం చంపి తినేసింది".కోపంతో బిగ్గరగా గర్జించింది సింహం. తన ఆహారాన్నే చంపి తిన్న ఆ మరొక సింహం ఎవరో వెంటనే తెలుసుకోవాలనుకున్నది.

కుందేలు మన సింహరాజుని ఇంకా రెచ్చగొట్టడం కోసం ఆ మరో సింహం చాలా పెద్దదని, పైగా ఈ అడవికి రాజు నువ్వా? - నేనా? తేల్చుకుందాం, ధైర్యం ఉంటే రమ్మందని మొదలైన మాటలు చెప్పడం ప్రారంభించింది. దానితో ఇంక కోపం పట్టలేని సింహరాజు కుందేలుతో తనని వెనువెంటనే ఆ మరో సింహం దగ్గరకు తీసుకెళ్ళమంది దాన్ని చంపటానికి.

కుందేలు సింహరాజుని తన వెంట ఒక లోతైన పెద్ద బావి వద్దకు తీసుకెళ్ళి ఆ మరో సింహం ఆ బావిలో వుందని చెప్పింది. సింహం బావి లోకి తొంగి చూసింది. బావిలో కనపడుతున్న తన ప్రతిబింబం చూసి అది ఆ మరో సింహం అని అనుకుని కోపంతో పెద్దగా గర్జించింది. బావిలోని ప్రతిబింబం కూడా గర్జించించినట్టు కనపడ్డమే కాక తన గర్జన ప్రతిధ్వని విని అది బావిలోని సింహపు అరుపుగా భ్రమించింది.

ఇక వెంటనే దానితో కలబడదామని నిర్ణయించుకుని బావిలోకి దూకింది మన సింహరాజు. ఇంకేముంది, బావిలోని బండరాయికి తల కొట్టుకోడంతో అక్కడికక్కడే చనిపోయింది సింహం.

అటుపై కుందేలు తనవారిని చేరుకుని అందరూ కలిసి హాయిగా జీవించారు.

మూలం : పంచతంత్రం కథలు

Tuesday, May 15, 2007

ఐకమత్యం ~ ఆలోచన


ఒక రోజు ఆకాశంలో కొన్ని పావురాలు గుంపుగా ఎగురుతూ వెళుతున్నాయి. అలా వెళుతు వెళుతూ నేల మీద ఒక చోట నూకలు పోసి వుండటం చూశాయి ఆ పావురాలు. నూకలు తినాలనే ఆశతో అవి కనిపించిన వైపు వెళ్ళబోతున్న పావురాలను హెచ్చరించాడు వాటి నాయుకుడు.
"అడవిలో నూకలు రావడం ఆశ్చర్యంగా వుంది. దీని వెనుక ఏదో మోసం వుండి వుంటుంది. ఈ నూకల కోసం మనం ఆశ పడకూడదు" అని. అందుకు ఆ గుంపులోని ఒక ముసలి పావురం
"లేని పోని అనుమానాలతో దొరికిన ఆహారాన్ని వదులుకుంటే బ్రతకడం ఎలాగ?" అని తమ నాయకుని మాటను త్రోసిపుచ్చింది. మిగిలిన పావురాలు కూడా నూకలపై ఆశతో ముసలి పావురం మాటకే వంత పాడాయి. అలా నాయకుడి మాటను పెడ చెవిన పెట్టి పావురాల గుంపు ఎగురుతూ వచ్చి నేలపై వాలింది.
అంతే! అలా వచ్చే పక్షుల కోసమే వల వేసి వుంచిన ఒక వేటగాడి వలలో చిక్కుకున్నాయి పావురాలన్నీ. దాంతో అందరూ ముసలి పావురాన్ని నిందించడం మొదలు పెట్టారు. అప్పుడు మళ్ళీ పావురాల నాయకుడు ఇలా అన్నాడు "ఆపదలు వచ్చినపుడు ఆలోచన ముఖ్యం. అంతేగానీ ఇలా ఒకరినొకరు నిందించుకుని ఏమి లాభం? ముందు మనం ఈ ఆపద నుండి భయట పడాలి. అందుకు నేనొక ఆలోచన చెప్తా జాగ్రత్తగా వినండి. మనమందరం ఒక్కసారిగా గనుక పైకెగిరితే వలతో సహా పైకెళ్ళిపోవచ్చు. అదుగో వేటగాడు ఇటే వస్తున్నాడు. త్వరగా మన శక్తినంతా ఉపయోగించి ఒక్కసారిగా పైకెగురుదాం, ఊ..".
అంతే పావురాలన్నీ తమ నాయకుడు చెప్పినట్టుగానే శక్తినంతా కూడాగట్టుకుని వలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయాయి.
పావురాల నాయకుడు తన మిత్రుడైన ఒక ఎలుక దగ్గరకు వాటిని తీసుకెళ్ళాడు. ఎలుక వాడియైన తన పళ్ళతో ఆ వలను కొరికి పావురలను విడిపించింది.
చూశారా పిల్లలూ! ఐకమత్యంగా వుండి పావురాలు తమని తాము ప్రాణాపాయం నుండి ఎలా కాపాడుకున్నాయో!
మరి ఈ కథలో మీరు తెలుసుకున్న నీతి యేమిటి?
ఐకమత్యంతో ఏ పనైనా సులువుగా సాధించ వచ్చు. అంతే కాదు, ఈ కథలో మరో నీతి కూడా వుంది. ఆపదలో చిక్కుకున్నప్పుడు ఆలోచన ముఖ్యం.

Tuesday, April 24, 2007

కోతులు - పాలపిట్ట


















.............................................................................................................................
మూర్ఖులకు మంచి మాటలు, మంచి సలహాలు చెవికెక్కవు. అలాంటి వాళ్ళకి సలహాలు చెప్పటం వృధా ప్రయాస మాత్రమేకాదు. ఒక్కోక్కసారి ప్రాణాలకు కూడా ముప్పు కలుగవచ్చు. అందుకనే సాధ్యమయినంత వరకు మూర్ఖులకు దూరంగా ఉండటం ఉత్తమం. మూర్ఖులైన కోతిమూకకి ఓ సలహా ఇవ్వబోయి తన ప్రాణాలు పోగొట్టుకున్న పక్షి వైనం ఈకధలో తెలిసుకుందాం.
పూర్వం ఓ కొండ ప్రాంతంలో ఓ కోతుల గుంపు ఉండేది. అవి కొండ క్రిందునున్న గ్రామాలలోకి దండుగా వచ్చి దొరికినంత ఆహారం తిని మిగిలిన ఆహారాన్ని పట్టుకుపోయి కొండ ప్రాంతంలోని తమ స్ధావరంలో దాచుకుని వచ్చినన్ని రోజులు తిని మళ్ళీ యధావిధిగా ఆహారం కోసం గ్రామాల మీద పడేవి.
ఆ కోతుల స్ధావరం దగ్గరే ఉన్న ఓ మర్రిచెట్టు మీద ఓ పాలపిట్టల జంట కాపురం చేస్తుండేవి. రోజూ సాయంత్రంపూట ఆ కోతుల దండు చేసే వింత చేష్టలు ఆ పాలపిట్టల జంటకు వినోదం కలిగిస్తూ ఉండేది.
అది చలికాలం. ఓ సాయంత్రం పూట ఆ కోతులకి చలికాగాలన్న ఆలోచన కలిగింది. వెంటనే చెట్ల మీద ఎగురుతున్న మిణుగురుపురుగులను తీసుకొచ్చి కుప్పగా పోసి వాటి చుట్టూ కూర్చున్నాయి. మిణుగురు పురుగులనుండి వెలుగు తప్ప వేడి రాకపోవటంతో వాటికి ఏం చెయ్యాలో అర్ధం కాక బుర్రలు గోక్కోసాగాయి. వాటి అవస్ధ చెట్టు మీద పాలపిట్ట జంట చూసి నవ్వుకున్నాయి. ఆ జంటలోని మగపిట్ట 'పాపం! అవి మంట ఎలా పుట్టించాలో తెలియక బాధ పడుతున్నాయి. వాటికి వివరంగా చెప్పివస్తాను' అంది. అందుకు ఆడపిట్ట 'వద్దు! అవి కోతులు వాటికి విచక్షణా జ్ఞానం తక్కువ, వాటి మధ్యకు నువ్వు వెడితే నీకేదన్నా అపకారం తలపెడతాయి' అంది భయంగా. 'ఫర్వాలేదులే! అవి మరీ అంత మూర్ఖమైనవి కావు' అంటూ ఆ పాలపిట్ట రివ్వుమంటూ చెట్టుమీద నుంచి ఎగిరి ఆ కోతుల గుంపు మధ్యలో వాలింది. తమ మధ్యలో వాలిన ఆ పాలపిట్ట వంక గుర్రుగా చూసాయి గుంపులోని కోతులు. పాలపిట్ట అది పట్టించుకోకుండా 'మిత్రులారా! ఇవి పురుగులు వీటి వల్ల కొంచెం వెలుగు వస్తుంది కానీ వేడి రాదు. మీరు చలికాగాలంటే వెళ్ళి ఎండుకట్టెలు తెచ్చుకుని వాటిని చెకుముకిరాయిని రాజేసి వచ్చే నిప్పుతో అంటించండి. అపుడు మంట వచ్చి చలి తీరుతుంది' అంది. కోతులకి తమకి సలహా ఇవ్వటానికి పాలపిట్ట వచ్చిందని కోపం వచ్చింది. 'ఇంతలేవు నువ్వు మాకు సలహా యిస్తావా?' అంటూ ఆ పిట్టను పట్టుకుని పుటుక్కుమంటూ మెడను విరిచి చంపేసాయి.


పాపం ఆ పాలపిట్ట లోని ఆడపిట్ట 'మూర్ఖులకి సలహా యివ్వటం మంచిది కాదని చెప్పినా వినకుండా ప్రాణాలు పోగొట్టుకున్న ఆ మగపిట్ట కోసం ఏడుస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది.
~
నీతి : మూర్ఖులకు సలహాలు ఇవ్వరాదు మరియు వారికి దూరంగా వుండుట మంచిది
^
source : పంచతంత్రం కథలు

Monday, April 2, 2007

అత్యాశగల కుక్క


ఒక కుక్క ఆకలితో తిరిగి తిరిగి చివరకు ఒక మాంసపు ముక్క దొరికించుకుంది. ఆ ముక్క మళ్ళీ ఏదన్నా వేరే కుక్క ఎత్తుకు పోతుందేమోనని భయపడి ఇంటికి పరిగెత్తుకుంటూ పోతుండగా దారిలో ఒక వంతెన దాటవలసి వచ్చింది.
అప్పుడు ఆ నీళ్ళలో తన నీడని తనే చూసుకుని ఇంకో కుక్క అనుకుని దాని నోట్లో వున్న మాంసపు ముక్క కూడా తనే చేత చిక్కించుకోవాలని నీళ్ళలోనికి దుమికింది.
అప్పుడు మన కుక్కగారి నోట్లో వున్న మాంసపు ముక్క ఆ నీళ్ళలోకి జారిపోయింది. నీడ కూడా మాయమయి ఇంకో కుక్క కూడా కనిపించలేదు.
అలా వున్నది కూడా పోగొట్టుకుని ఆ రోజంతా ఆకలితో వుండ వలసి వచ్చింది.
పిల్లలూ, మరి ఈ కథలో నీతి యేమిటి?
ఎప్పుడూ తన దగ్గర వున్నవాటితో తృప్తిగా వుండవలెను. అత్యాశ ఎన్నటికీ కూడదు.
^
^

తోడేలు - మేకపిల్ల




















ఒక సెలయేరు దగ్గరకి నీళ్ళు త్రాగడానికి ఒక మేక పిల్ల వచ్చింది.అప్పుడే అక్కడికి ఒక తోడేలు కూడా వచ్చింది. తోడేలుకి ఆ మేకపిల్లను తినవలె అని దుష్టబుద్ది పుట్టి, ఆ మేకపిల్లతో "నేను త్రాగుతున్న నీళ్ళను ఎంగిలి చేస్తావా, చూడు నిన్ను ఎం చేస్తానో" అని అంది.
అప్పుడు ఆ అమాయకమైన మేకపిల్ల "అయ్యా నేను ఇవతల ఒడ్డున నీళ్ళు తాగుతున్నాను, మీరు అవతల ఒడ్డున నీళ్ళు తాగుతున్నారు, మీ నీళ్ళు నేనెలా ఎంగిలి చేస్తాను?" అని అడిగింది.
ఆ మాట విని తోడేలు "నువ్వు ఆరు నెలల క్రితం నన్ను తిట్టావు, అది తీవ్రమైన తప్పు, అందుకు నిన్ను శిక్షించాలి" అని అనగా మేకపిల్ల "అయ్యా నేను మూడు నెలల పిల్లను, ఆరు నెలల క్రితం మిమ్మల్ని నేనెలా తిట్టగలను?" అని అడిగింది.
అప్పుడు తోడేలు "నువ్వు కాకపోతే నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ తిట్టి వుండకూడదా" అని ఆ మేకపిల్లని తిని చక్కా పోయింది.


మరి ఈ కధలో నీతి యేమిటి పిల్లలూ?


లేని నేరములు మోపి ఇతరులకి కీడు చెయ్యటమే దుష్టులకి పని. అందుకని దుష్టులకి ఎప్పుడూ దూరంగా వుండవలెను.
^
^

Wednesday, March 21, 2007

కుందేలు - తాబేలు




ఒక అడవిలో ఒక కుందేలు, అక్కడే చెఱువులో ఒక తాబేలు నివసిస్తూ వుండేవి.
కుందేలుకి ఏమో తనని పరుగుపందెంలో ఎవరూ ఓడించలేరు అని బాగా గర్వం అన్నమాట.
అలా ఒకనాడు ప్రగల్భాలు పలుకుతూ తాబేలుతో "నాతో పందెం కాయి గెలుపు ఎవరికి లభిస్తుందో చూద్దాం" అని తాబేలుని ఉసిగొల్పింది. తాబేలేమో సరే అని ఒప్పుకుంది.
ఇక పందెం ప్రారంభం అయ్యింది. కుందేలు ఏమో గబగబ గంతులువేస్తూ ముందుకు పరుగెత్తింది. తాబేలేమో పాపం నెమ్మదిగా నడుస్తూ వస్తోంది. కుందేలు కొంచెం దూరం పోయాక, వెనక్కి తిరిగి చూస్తే తాబేలు కనపడలేదు.
సరే ఈ తాబేలు నన్ను ఎప్పుడు ఓడించాలి అనుకుంటూ, పక్కనే వున్న పొదల మాటున కొంతసేపు నిద్రపోయింది.
ఇంతలో పట్టుదల కలిగిన మన తాబేలు ఎలాగైనా పందెంలో నెగ్గాలి అనుకుంటూ, నడుచుకుంటూ వస్తూనిద్రపోతున్న కుందేలుని చూసి కొంచం వేగం పెంచి గమ్యస్థానానికి చేరుకుంది. కొంచం సేపు అయ్యాక, మన కుందేలుకి మెలకువ వచ్చింది. లేచి చూస్తే తాబేలు కనపడలేదు.హయ్యో... ఈ తాబేలు ఇంకా ఎక్కడో వెనకాల వుండి వుంటుంది. నేను పోయి పందెం గెలుస్తా ఇక అని మళ్ళీపరుగులు ప్రారంభించింది.
గమ్యస్థానానికి చేరిన కుందేలుకి, అప్పటికే అక్కడ వున్న తాబేలుని చూసి గర్వభంగం అయ్యిందన్న మాట.
మరి ఇందులో నీతి ఏమిటి పిల్లలూ?

ప్రగల్భాలు పలికే వారు ఎప్పుడూ కార్యాన్ని సాదించలేరు. కాబట్టి ఎప్పుడూ గర్వాన్ని పెంచుకోకూడదు.
^
^
~*~
^
^

Thursday, March 15, 2007

ఆవు - పెద్దపులి





ఒక అడవిలో ఒక పులి వుండేది.
అది ఆకలితో తిరుగుచుండగా దానికొక ఆవు కనపడింది. అలాకనపడగానే దానిని తినటానికి పులి ఆవు మీద పడింది. అప్పుడు ఆ ఆవు మనసులో భయపడినది గాని, ఎలాగూ పులి చంపితింటుంది అని నిశ్చయించుకుని
"అయ్యా నేను ఈ మధ్యనే ఈనాను. నా దూడ పాలకి యేడుస్తూ వుంటుంది. నేను వెళ్ళి పాలు ఇచ్చిఇప్పుడే వస్తాను. ఆ దైవ సాక్షిగా నా మాట నమ్ము" అని పులిని అడిగింది.
ఆ మాటలు పులి రాజు నమ్మి "పోయి రా" అని చెప్పగానే ఆ ఆవు పరుగెత్తుకుని పోయి తన దూడకి కడుపునిండాపాలు ఇచ్చి, తోడి పశువులకు దూడని అప్పగించి పులి వద్దకు వచ్చింది.
అప్పుడు మన పులి రాజు, ఆవు తన మీద వుంచిన నమ్మకాన్ని వమ్ము చేయనందుకు సంతోషించి,దాన్ని చంపక దయతో విడిచి పెట్టింది. ఆవు పులి దయా గుణాన్ని మెచ్చుకుని ఇంటికి పోయి తన దూడతోహాయిగా వుంది.
~
ఈ కధలో నీతి యేమిటి పిల్లలూ?
~
సత్యము వలన ఎల్లప్పుడూ మేలు కలుగుతుంది. ఎప్పుడూ అబద్దాలు ఆడకూడదు.
^
^

కాకి - నెమలి








ఒక అడవిలో నెమళ్ళు గుంపుగా వుండేవి. అదే అడవిలో కాకుల గుంపు కూడా వుండేది. ఒక రోజు నెమళ్ళు అన్నీ తమ తమ పింఛాలు పురి విప్పుకుని ఆనందంతో వుండగా, కాకుల గుంపులో ఒక కాకి వాటిని చూసి అసూయతో"నాకు కూడా ఇలా పింఛాలు వుంటే బాగుండు కదా" అని బాగా ముచ్చట పడి ఊడి పడిపోయిన నెమలి ఈకలు యేరితెచ్చుకుని తన తోకకి అంటించుకుని, కులుకుతూ తిరగటం మొదలు పెట్టింది.
ఇలా రోజు కొన్ని ఈకలు తెచ్చుకుని "నేనే గొప్ప, నేనే గొప్ప" అని అనటం మొదలు పెట్టింది. కొద్ది రోజులు అయ్యేప్పటికినెమళ్ళు ఈ సంగతి కనిపెట్టి, దానికి వున్న నాలుగు ఈకలూ కూడా పీకి పారేసి తరిమి కొట్టాయి.
ఈకలు అన్నీ ఊడి పోగానే దెబ్బకి కాకి రూపం మారిపోయింది. అందువల్ల మిగిలిన కాకులు కూడా తమ గుంపులోంచి ఈకాకిని వెళ్ళగొట్టాయి. ఎందులోనూ చేరక కాకి విచారిస్థూ కూర్చుంది.
~
మరి ఈ కధలో నీతి యేమిటి పిల్లలూ?
~
తనకు లేని వేషములు వేయకూడదు, వేరే వాళ్ళని చూసి వాళ్ళకి వున్నాయి అని మనము వాతలు పెట్టుకోకూడదు.
^
^